హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): రైతులంటేనే కాంగ్రెస్ సర్కార్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన ప్రభుత్వం కలవరపాటుకు గురవుతున్నది. సర్పంచ్ ఎన్నికల్లో హస్తం పార్టీని రైతన్నలు చావుదెబ్బ కొట్టడం సర్కార్ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తే, మొన్నటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌తో రేవంత్ అండ్ టీం కకావికలమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలిన ఈ పరిస్థితుల్లో పల్లెల్లో పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని గ్రహించి పరిషత్ ఎన్నికలకు వెనుకంజ వేయడంతో పాటు ఉన్నపళంగా పీఏసీఎస్, డీసీసీబీ కమిటీలను రద్దు చేసింది. తమ రెండేండ్ల పాలనలో రైతులు పడిన కష్టాల నేపథ్యంలో కమిటీలను కొనసాగించినా, ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా గుణపాఠం తప్పదనే ఆందోళనతో నామినేటెట్ పద్ధతిలో కమిటీలు వేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
రైతులు ఓట్లేసే ఎన్నికలు వద్దు
కాంగ్రెస్ సర్కార్‌పై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెండేండ్లలో వారు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. యూరియా కొరత, విత్తనాల కొరత, పంటలు అమ్ముకోలేని దుస్థితి, మద్దతు ధర కరువు, బోనస్ రాదు, రైతుభరోసా రాదు, అరకొర రుణమాఫీ.. ఇలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా యూరియా విషయంలో అన్నదాతలు కోపంతో రగిలిపోతున్నారు. ఒక బస్తా కోసం రాత్రీపగలు తేడా లేకుండా లైన్లు కట్టడం, యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావడంతో రైతులంతా కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. ఇందుకు ఇటీవలి సర్పంచ్ ఫలితాలను ఉదహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసింది మెజారిటీ రైతులే. తమను ఇబ్బందిపెట్టిన అధికార కాంగ్రెస్‌కు ఓటుతో దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో పాటు అండగా నిలుస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్కు మద్దతునిచ్చారు.
ఈ క్రమంలో ఫలితాలను కంగుతిన్న రేవంత్ సర్కారు.. రైతులు నేరుగా ఓట్లు వేసే ఏ ఎన్నికలనూ నిర్వహించొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ నిర్వహిస్తే ఘోర పరాభవం తప్పదనే భయం పట్టుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ నెల 19న హఠాత్తుగా గ్రామాల్లోని 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 9 డీసీసీబీలు, 9 డీసీఎంఎస్‌ల పాలకవర్గాలను రద్దు చేసింది. వాస్తవానికి వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటినుంచీ ఎన్నికలు నిర్వహించకుండా పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మొత్తానికే రద్దు చేసి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లేకుండా కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల తరహాలో పీఏసీఎస్, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లకు కూడా చైర్మన్లను, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించారని తెలిసింది. తద్వారా రైతులు, వారి ఓట్లతో సంబంధం లేకుండా పదవులు కట్టబెట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్న్లట్టు చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యలా..
పీఏసీఎస్ అంటేనే రైతుల సమూహం. గ్రామాల్లో ఇవి కీలకంగా ఉంటాయి. రైతులకు రుణాలు, యూరియా, ఇతర పథకాల అమలులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిలోనూ పీఏసీఎస్ కీలక పాత్ర పోషించి, కొరకరాని కొయ్యగా మారినట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. పీఏసీఎస్ పాలకవర్గాలు కాంగ్రెస్‌కు మద్దతివ్వకపోవడమే గాక, మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ సానుభూతిపరులు ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వాటిని రద్దు చేసి సర్పంచ్ ఎన్నికల్లో ఓటమికి కక్ష తీర్చుకోవచ్చని భావించినట్టు తెలిసింది. ఒకవేళ ఎన్నికలు పెట్టినా మళ్లీ బీఆర్ఎస్ సానుభూతిపరులే గెలిచే అవకాశం ఉన్నదని, సర్కారు చేయించిన సర్వేలో తేలడం.. అందుకే అసలు ఎన్నికలే లేకుండా నామినేటెడ్ పద్ధతికి ఓకే చెప్పిట్టు సమాచారం. ఇక ప్రభుత్వమే నచ్చినవారికి పదవులు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు జోరుగా చర్చ జరుగుతున్నది.