కొడిమ్యాల, నవంబర్ 16: నెల రోజులైనా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఆదివారం జగిత్యాల జిల్లా పూడూర్లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. తాలు పేరిట గతంలో 40 కేజీల సంచికి మూడు కేజీలు కోత విధించడంపై మండిపడుతున్నారు. రైతు ఐక్యవేదిక మండల అధ్యక్షుడు ఏలేటి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని 24 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 20 రోజులైనా కొనుగోళ్లు సాగడం లేదని విమర్శించారు. ప్రతీ కేంద్రం నుంచి మొదటి రోజు మాత్రమే ఒక్కో లారీ బస్తా 42 కిలోల చొప్పున తూకం వేశారని తెలిపారు. ఇప్పటికైనా వడ్లు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. తహసీల్దార్ కరుణాకర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.