రుణమాఫీ రెండో జాబితాలోనూ తమ పేర్లు రాలేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా మాఫీ కాకపోవడమేంటని వాపోతున్నారు. పాస్‌పుస్తకం, రేషన్ కార్డు ఉన్నా రుణం మాఫీ చేయకపోవడంపై మండిపడుతున్నారు. పలుచోట్ల వ్యవసాయ శాఖ, బ్యాంకుల అధికారుల తప్పిదాల వల్ల మాఫీకి నోచుకోలేకపోయారు. ఎవరో చేసిన తప్పులకు తామెలా బాధ్యులమంటూ రైతులు నిలదీస్తున్నారు.
Runa Mafi | తిమ్మాపూర్, జూలై 31: రేషన్‌కార్డు లేదని ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన యువరైతు గూడ అభినవ్ బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తాను రెండేండ్ల క్రితం అల్గునూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తీసుకున్న రూ.95 వేలను మాఫీ చేయకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పంట రుణాల మాఫీ భూస్వాముల మేలు కోసమేనని ఆరోపించారు. రూ.రెండు లక్షలు మాఫీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని.. దీనివల్ల బడుగు బలహీన వర్గాల వారు లబ్ధిపొందుతున్నారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగినైన తన లాంటి వారికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తమకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనల ముసుగులో అన్నదాతను ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
హనుమకొండ సబర్బన్, జూలై 31: ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ వ్యవహారం మొత్తం గందరగోళంగా మారింది. మొదటి విడతతోపాటు రెండో విడత చేపట్టిన రుణమాఫీ పథకంలో గ్రామీణ ప్రాంతంలో అన్నదాతలు తమ పేర్లు మాఫీ జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. హనుమకొండ జిల్లాలో 1,40,011 మంది రైతులు ఇప్పటివరకు వ్యవసాయ శాఖ గణాంకాల్లో ఉన్నారు. వీరికి గత ప్రభుత్వాల హయాంలో రూ.132.13 కోట్లు రైతుబంధు రూపేణా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణాల మాఫీ విషయంలో గణాంకాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలకు సంబంధించి 40,091 మందికి రుణమాఫీ జరిగినట్టుగా గణాంకాలు చెబుతుండగా, అసలు 1.40 లక్షల మంది పైచిలుకు రైతులు గత ఎన్నికల కంటే ముందే నమోదై ఉండటం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే భారీ ఎత్తున రైతులకు రుణమాఫీ డబ్బులు ఎగ్గొట్టారనేది స్పష్టమవుతున్నది.
నల్లబెల్లి, జూలై 31: ఆధార్ నమోదు తప్పిదంతో రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు తెలపాలని ప్రభుత్వ యంత్రాంగం బ్యాంకు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఒకరి ఆధార్.. మరొకరికి రుణం’ కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గురువారంలోగా ఆధార్ నమోదు తప్పిదంతో రుణమాఫీకి అనర్హులైన జాబితాను సమర్పించాలని ఆయా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడంలో ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు బుధవారం నిమగ్నమయ్యారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీసీసీబీలో ఏజీఎం మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. కాగా, డీసీసీ బ్యాంకుల్లో జరిగిన విచారణను డీసీవో సంజీవరెడ్డి పర్యవేక్షించారు.
కుంటాల, జూలై 31 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కే) గ్రామానికి చెందిన అహ్మద్ ఆదిలాబాద్ డీసీసీ బ్యాంకులో 2015లో రుణం తీసుకున్నాడు. 2022లో రూ.11 వేల వడ్డీ కట్టి, రూ.40 వేల రుణం పొందాడు. మళ్లీ 2022 సెప్టెంబర్‌లో అదనంగా రూ.30 వేలు తీసున్నాడు. మొత్తం రూ.70 వేలు బాకీ ఉన్నాడు. 2023లో రెన్యువల్ చేయించలేదు. రాష్ట్ర సర్కారు రుణమాఫీ చేస్తుందని తెలిసి బ్యాంకుకు వెళ్లాడు. పరిశీలింగా రూ.1.12 లక్షలు కట్టాల్సింది ఉన్నది. వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా.. జాబితాలో అహ్మద్ పేరు లేదని అధికారులు తెలిపారు. ఎందుకని అడుగగా.. తన అకౌంట్‌కు ఆధార్ లింక్ కాకపోవడంతో రుణమాఫీ వర్తించలేదని చెప్పారు. దీంతో రైతు బ్యాంకుకు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. సెక్రటరీ నాగభూషణ్‌ను వివరణ కోరగా.. సాంకేతిక లోపంతో ఆధార్ లింకు కాలేదని, వెంటనే అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసి రుణమాఫీ కోసం ఫైల్‌ను పైఅధికారులకు పంపుతామని తెలిపారు.
కెనరా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో మాఫీ అయిన డబ్బులు వెనక్కి పోయాయి. హద్నూర్ కెనరా బ్యాంకులో రూ.75 వేల పంట రుణం తీసుకున్న. దానికి వడ్డ్డీతో కలిపి రూ.1.20 లక్షల వరకు బ్యాంకులో అప్పు అయ్యింది. వడ్డీతో సహా డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్న. రుణమాఫీలో రూ.లక్షలోపు తీసుకున్న జాబితాలో నాపేరు వచ్చింది. బ్యాంకుకు వెళ్లి చూస్తే డబ్బులు రాలేదని అధికారులు చెప్పారు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే ఆధార్ కార్డు నంబర్‌తో స్టేటస్ పరిశీలిస్తే రూ. 75 వేల రుణ మాఫీ అయింది. బ్యాంకు ఖాతా తొలిగించడంతో డబ్బులు వెనక్కి వెళ్లిపోయినట్టు చెప్పిండ్రు. బ్యాంకులో తీసుకున్న లోన్‌కు వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తే, బ్యాంకు అధికారులు మాత్రం తీసుకున్న రూ.75 వేలు మాత్రమే ప్రభుత్వానికి పంపడం దారుణం. బ్యాంకు అధికారులు రెన్యూవల్ రుణ ఖాతా నంబర్ పంపకుండా పాత ఖాతా నంబర్ పంపి నాకు అన్యాయం చేసిండ్రు. కెనరా బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి.
– అవుటి అంజన్న, హద్నూర్, సంగారెడ్డి జిల్లా
ఏం కాంగ్రెస్ సర్కారో ఏమో.. రైతులమంతా ఆగమైతు న్నం రుణమాఫీ చేయవట్టి. సర్కారోళ్లు చేప్పేది ఒకటి చేసేది ఒకటి. నాకు 1.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అక్కన్నపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రెండేండ్ల కిందట పాసుపుస్తకాలు పెట్టి రూ.50 వేలు రుణం తీసుకున్న. ఏడాదికోసారి రెన్యువల్ చేసుకున్న. కానీ, నాకు రుణమాఫీ వర్తించలేదు. నాకు రేషన్‌కార్డు, పాసు బుక్కు ఉన్నది. నాకు రుణమాఫీ ఎందుకు వర్తించలేదో అర్థం కావడంలేదు. రూ.లక్షలోపు రుణమాఫీ కింద నా బకాయి మాఫీ కాకపోవడంతో వ్యవసాయ అధికారులను, బ్యాంకోళ్లను అడిగిన. లక్షన్నర రుణమాఫీ లిస్టులో వస్తదని చెప్పిండ్రు. ఇప్పుడు లక్షన్నర రుణమాఫీ లిస్టులోనూ నా పేరు లేదు. అధికారులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి పేరు పెద్దరికంగా రుణమాఫీ చేస్తున్నామనీ చెప్పుతుండు. కానీ, ఊర్లలోకి వచ్చి చూస్తే నాలాంటోళ్ల బాధ తెలుస్తది. గిట్ల చేస్తే రానున్న రోజుల్లో సర్కారుకు పుట్టగతులు ఉండవు.
-మిట్టపల్లి లింగమూర్తి, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా
జగిత్యాల రూరల్, జూలై 31: జగిత్యాల జిల్లాలో అప్పుల బాధ భరించలేక పాడిరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం పోరండ్ల గ్రామానికి చెందిన రైతు పడిగెల శ్రీనివాస్ (44) తన వ్యవసాయభూమిలో రూ.20 లక్షలు అప్పు చేసి ఐదేండ్ల క్రితం డెయిరీ ఫాం పెట్టాడు. నష్టం రావడంతో అప్పుల తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు విష్ణువర్ధన్ పొలం వద్దకు వెళ్లి చూడగా తండ్రి నురగలు కక్కుతూ కనిపించాడు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.