మహబూబాబాద్ రూరల్, నవంబర్ 28 : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనడానికి కనీసం వారం రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వ్యాపారులు కాంటాలు ఆలస్యం చేయడంతో ఎటుచూసినా ధాన్యం కుప్పలే దర్శనమిచ్చాయి. బయ్యారం, గార్ల, కురవి, డోర్నకల్ నుం చి వచ్చిన రైతులు రాత్రి చలిలో వణుకుతూ మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు మార్కెట్కు ధాన్యం తీసుకురాకుండా గేట్లకు తాళాలు వేస్తున్నారని వాపోతున్నారు.
మార్కెట్ తెచ్చిన ధాన్యానికి కాంటా ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితి ఉంది. మార్కెట్లో వడ్లు పోసి వారం రోజులైతంది. ఇంకా కాంటా కాలేదు. అధికారుల దగ్గరకు పోయి అడిగితే వ్యాపారులు రాలేదని చెప్తాన్రు. త్వరగా కాంటాలు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలె.
ఈ ఏడాది వడ్లు పండించి అరి గోస పడుతున్నం. పంట తీసుకొచ్చి మార్కెట్లో పోసినం. కాంటాలు ఎప్పుడు చేస్తరో తెలియదు. వ్యాపారులు వచ్చి పాట ఎప్పుడు వేస్తారో, వడ్లు ఎప్పుడు అమ్ముడు పోతాయోనని గందరగోళంగా ఉంది. మార్కెట్ అధికారులు కాంటాలు టైముకు చేయాలె.