మందమర్రి, ఏప్రిల్ 22: ‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలోని బురదగూడేనికి చెందిన రైతు దుర్గం వెంకన్న తన ఖాతా లో జమైన రైతు భరోసా రూ.6వేలను తీ సుకుందామని బుధవారం మందమర్రిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వె ళ్లాడు. 2023 నవంబర్ 16న పంట రు ణం రూ.2 లక్షలు తీసుకున్నావని, అందు కు సంబంధించిన వడ్డీ రూ.58 వేలు కడితేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో వెంకన్న ఆందోళనకు గురయ్యాడు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి పంట రుణం తీసుకుంటే రుణమాఫీ కాకపోగా వడ్డీ కట్టాలని ఇబ్బందులు పెట్టడం సరికాదని రైతు వాపోయాడు. రుణమాఫీకి అర్హత ఉన్నా తనకు మాఫీ చేయలేదని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తనకు రుణమాఫీ చేయాలని కోరాడు. ఈ విషయమై బ్యాంకు సిబ్బందిని వివరణ కోరగా క్రాప్ లోన్‌కు సంబంధించి వడ్డీ కట్టి లోన్ రెన్యువల్ చేయకపోవడంతో వెంకన్న ఖాతాను హోల్డ్‌లో పెట్టినట్టు తెలిపారు.