సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 14: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సీఎం పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హితవు పలికారు. సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో దాదాపు 397 గ్రామాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న సంగమేశ్వర- బసవేశ్వర లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టుకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
దాదాపు 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించేలా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే మెతుకు సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే సంగమేశ్వర-బసవేశ్వర వంటి కీలక ప్రాజెక్టులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని సూచించారు.
సీఎం పర్యటనలో కొత్త హామీలు ఇవ్వడం కంటే గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగారెడ్డికి నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటనల్లో చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పను లు పూర్తి చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో మం జూరైన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులు పూర్తి చే యాలన్నారు. సంగారెడ్డికి రూ.9.31కోట్లు, సదాశివపేటకు రూ.7.30 కోట్లు మం జూరు కాగా, అవసరమైన నిధులనువిడుదల చేసి పనులు పూర్తి చేయాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్, టీయూఎఫ్ఐడీసీ నిధులు తిరిగి మంజూరు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. ఆత్మకూర్-సింగూరు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ఎంఆర్ఆర్ రోడ్ల పనులకు చర్యలు తీసుకోవాలని, మినీ హజ్ హౌజ్‌కు అదనపు నిధులు ఇవ్వాలని, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను వెంటనే ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సంగారెడ్డికి మెట్రో రైలు పొడిగించాలని, మహబూబ్‌సాగర్ చెరువును అభివృద్ధి చేయాలని, ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని లేఖలో ప్రస్తావించారు.