హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో పత్తి సాగయ్యే భూములకు పెట్టుబడి సాయం వస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. వానకాలంలో పత్తి పంట సాగు చేసిన రైతులు.. యాసంగిలో ఆ భూములను ఖాళీగానే ఉంచుతారు. అలాంటప్పుడు ఈ భూములకు రైతు భరోసా ఇవ్వరా? అనే ప్రశ్న నెలకొన్నది. అదే విధంగా వానకాలంలో సాగు చేసి యాసంగిలో సాగు చేయని కంది, సోయాబీన్, మొక్కజొన్న, పప్పు పంటల భూములకు కూడా ప్రభుత్వం రైతుభరోసా ఇస్తుందా? లేదా? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి నుంచే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ విధి విధానాల రూపకల్పనపై దృష్టి సారించింది. మంత్రులు ఒక్కోసారి ఒక్కో నిబంధన చెప్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. పంట వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. ఈ లెక్కన యాసంగిలో తమకు రైతు భరోసా రాదా? అంటూ ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో రైతుల మధ్య ఇదే చర్చ జరుగుతున్నది.
పత్తి, కంది, మొక్కజొన్న, సోయా తదితరాలు వర్షాధార పంటలు కావడంతో వానకాలంలోనే సాగవుతాయి. యాసంగిలో నీళ్ల కొరతతో రైతులు వీటిని సాగు చేయరు. దీంతో ఈ భూములు సాగుకు యోగ్యమైనప్పటికీ బీడుగానే ఉంటాయి. సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో ఈ పంటలు పండించే భూములకు యాసంగిలో రైతుభరోసా రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వానకాలంలో పత్తి సుమారు 45-55 లక్షల ఎకరాల్లో, కంది, సోయా పంటలు సుమారు ఐదేసి ఎకరాల్లో సాగవుతాయి. వరి సాగు కూడా వానకాలంతో పోల్చితే యాసంగిలో 15 లక్షల ఎకరాల వరకు తగ్గుతుంది. ఈ విధంగా సుమారు 70-80 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం తగ్గుతుంది. వేరుశనగ, శనగ పంటలు యాసంగిలో ఎక్కువగా సాగవుతాయి. ఈ రెండు పంటలు కలిపి సుమారు 7 లక్షల ఎకరాల వరకు సాగవుతాయి. ఈ రెండు పంటలకు వానకాలంలో కోత పెడతారా? అనే చర్చ జరుగుతున్నది. ఈ విధంగా ఇటు యాసంగిలో, అటు వానకాలంలో ఏదో ఒక సీజన్లో మాత్రమే సాగయ్యే పంటలకు రైతుభరోసా వస్తుందా? రాదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది.
పంట వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగి సీజన్లో రైతులకు రైతు భరోసాలో భారీగా కోత పడనున్నది. వానకాలంతో పోల్చితే యాసంగిలో సాగు విస్తీర్ణం సహజంగానే తగ్గుతుంది. రాష్ట్రంలో వానకాలంలో సుమారు 1.3 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, యాసంగి సీజన్లో 60-65 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు చెప్తున్న ప్రకారం.. యాసంగిలో సాగు చేయని ఈ 70 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇవ్వడం కుదరదు.