జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ): కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు నీళ్లివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం శిక్ష వేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్, ఉత్తమ్ అభాసుపాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ కండ్లు తెరిపించేందుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వచ్చినట్టు తెలిపారు.
ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా పంప్‌హౌస్ వద్దకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. కన్నెపల్లికి కేటీఆర్ పోవుడెందుకని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారని, పంప్‌హౌస్‌లో నీళ్లున్నాయని మంత్రి ఉత్తమ్ కండ్లకు చూపించేందుకే వచ్చారని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరుగుతారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు రైతులకు మంచి చేసే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.