నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 17: ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు గుండె ఆగి చనిపోగా.. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌కు చెందిన కౌలు రైతు వడదెబ్బతో మృతి చెందాడు. కాగా కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం ఏనెబావిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంత జరుగుతున్నా సర్కార్‌లో చలనం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు.
కాగా ఆదివారం కూడా అనేక జిల్లాల్లో రైతులు రోడ్లెక్కారు. నెల రోజులైనా వడ్లు తూకం వేస్తలేరని మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీ శివారులోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో చేశారు. కాంటా చేయడం లేదని, వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని సుమారు 200 మంది రైతులు సిబ్బందిని నిలదీశారు. తూకం వేసే వరకు కదలబోమని భీష్మించారు. కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట రైతులు రోడ్డెక్కారు. దుంపేట శివారులోని చింతకుంట ఎక్స్ రోడ్డు వద్ద కోరుట్ల-వేములవాడ రోడ్డుపై బైఠాయించారు. ‘ధాన్యం కొనిపించండి.. మీకు దండం సారూ’ అంటూ ఓ రైతు పోలీసుల కాళ్లపై పడ్డాడు. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి నెలరోజులు దాటిన తూకం వేయడంలేదని మండిపడ్డారు. పోలీసులు ఒకరిద్దరు రైతులను అదుపులోకి తీసుకొని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మిగతా రైతులంతా కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ముట్టడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో అవస్థలు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టిమల్ల రైతులు ఆవేదన చెందారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కొనుగోలులో తీవ్ర జాప్యంపై మండిపడ్డారు. గన్నీ సంచుల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు.
గన్నీ సంచులు సరిపడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. సరిపడా గన్నీ సంచులు ఇవ్వాలని, లారీలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో రాజీవ్ రహదారిపై మండుటెండలో రైతులు ధర్నా చేశారు. రైతులకు స్థానిక సర్పంచ్ తిరుపతిరెడ్డి మద్దతుగా పాల్గొన్నారు. ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అల్ల్లీపూర్ సొసైటీ ఆవరణలో పొద్దుతిరుగుడు పంటను పోసి 45 రోజులు గడిచినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. కొనుగోలు చేసిన మక్కలను దిగుమతికి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లుకు కూసుమంచి, తిరుమలాయ పాలెం మండలాల నుంచి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో రెండు కిలోమీటర్ల వరకు బారులుదీరాయి. కొనుగోలు కేంద్రాల్లో పక్షం రోజుల క్రితం కాంటా అయిన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించకపోవడంతో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో రైతులు ఆందోళన నిర్వహించారు. స్థానిక లారీ ఆఫీసు ముందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అధికారులు లారీలను సమకూర్చడంలేదని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట శివారులో చింతకుంట ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న రైతులు

గన్నీ సంచుల పంపిణీలో అవకతవకలు జరిగాయని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులు

నెల రోజులైనా వడ్లు తూకం వేస్తలేరని మెదక్ జిల్లా రామాయంపేటలోని సిద్దిపేట రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులు

కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో అవస్థలు పడుతున్నామంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలో ధర్నా చేస్తున్న రైతులు

పంటను కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా చేస్తున్న పొద్దుతిరుగుడు రైతులు