నమస్తే నెట్వర్క్: యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. అన్ని జిల్లాల్లో సోమవారం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
రైతుల తిరుగుబాటు ఖాయం: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్
సరిపడా యూరియా అందుబాటులోకి తేలేని ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలోని అంబేద్కర్ కూడలిలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు 12 శాతం కమీషన్లపై ఉన్న చిత్తశుద్ధి రైతులపై లేదని మండిపడ్డారు.
గోస తగలకమానదు: మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
రైతుల గోస కాంగ్రెస్‌కు తగలకమానదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీ ఎదుట రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. 52వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారని, ఒకనాడూ యూరియా సమస్యపై అడిగాడా? అని ప్రశ్నించారు.
కొరత ఇప్పుడెందుకు వచ్చింది?: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
పదేండ్లలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న రైతులను కలిసి మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను ప్రభుత్వం త్వరగా పరిష్కరించేలా చూడాలని వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. రైతులు పొలం పనులను పక్కనపెట్టి యూరియా కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
రైతుల కష్టాలు కనిపించడం లేదా?: హరిప్రియానాయక్
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ప్రశ్నించారు. ఇల్లెందులోని ఏడీఏ కార్యాలయంతోపాటు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట రైతువేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతూ నిరసన తెలిపారు.