నర్సంపేట నమస్తే నెట్వర్క్/నల్లబెల్లి, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకంలో ఎకరానికి రూ.15 వేలు అందించాలని, సన్న వడ్లకు బోనస్ రూ.500 రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తన నివాసం నుంచి ఎడ్లబండిపై వచ్చి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కారు హామీలన్నీ బోగసేనని తేలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతది భరోసా లేని బతుకైందని ఆవేదన చెందారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుభరోసాకు సంబంధించి ప్రతి రైతు ఖాతాలో డబ్బులు పడతాయని.. సెల్ ఫోన్లు టింగుటింగుమంటాయని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉందని కుంటి సాకులు చెబుతున్నారని విమర్శించారు.
ఇంకా వడ్ల బోనస్ రాలే
రెండున్నర ఎకరాల సొంత భూమితో పాటు పదెకరాలు కౌలు కు సాగుచేసిన. 240 క్వింటాళ్ల వ డ్లు పండినయి. బోనస్ వస్తుందనే ఆశతో కంటికి రెప్పలా ఇరవై రోజులు పంటను కా పాడి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆరబోసి అమ్మిన. లక్ష రూపాయల వరకు బోనస్ రావాలే. నెల దా టింది. ఎప్పుడు వేస్తరో తెలియదు. బోనస్ వస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు కట్టుకుందామనుకున్న.
– గండు బాలకృష్ణ, రైతు, బయ్యారం, మహబూబాబాద్
రెండు నెలలైనా పైసలు వేయలే
32 క్వింటాళ్ల ధాన్యాన్ని ముంగిముడుగు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన. నెల పదిహేను రోజుల తర్వాత మద్దతు ధర పైసలు వచ్చినయి. కానీ, రెండు నెలలైనా బోనస్ పైసలు వేయలేదు. అధికారులకు ఫోన్ చేస్తే వస్తుందని అంటున్నారు తప్ప వేయడం లేదు. 48 గంటల్లో బోనస్ వస్తదని కాంటా పెడితే ఇప్పటికీ పైసలు రాలేదు. బోనస్‌పై అశతో యాసంగి సాగు కోసం మిత్తికి పైసలు తెచ్చిన. వడ్డీ పెరుగుతున్నది.
– మారపంగు వెంకన్న, రైతు, మహబూబాబాద్
ఎప్పుడిస్తరో చెప్పట్లేదు
నిరుడు డిసెంబర్ 23న బొల్లికుంటలోని ఐకేపీ సెంటర్లో 32 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. నెల తర్వాత క్వింటాలుకు రూ.2,327 చొప్పున అకౌంట్ లో పడ్డయి. బోనస్ మాత్రం పడలే. మా గ్రామంలో 20 మంది బోనస్ రా ని రైతులు ఉన్నారు. రైతును రాజును చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం మా శ్రేయస్సును మరిచింది.
-దేవర రాజు, బొల్లికుంట, వరంగల్
ఆశపడి నష్టపోయాం
అప్పులు చేసి నాలుగున్నర ఎకరాల్లో పంట పండించిన. బోనస్ వస్తదనే ఆశతో కొనుగోలు కేంద్రంలో 158 క్వింటాళ్లు అమ్మిన. రూ.79,200 రావాలి. అధికారులను ఎప్పుడు అడిగినా వస్తదనే అంటున్నరు. ఇప్పటికే మూడు నెలలైంది. కాంగ్రెస్ పాలనలో ప్రచారమే తప్ప, రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.
– హెచ్ సంతోష్‌కుమార్, నిజామాబాద్ జిల్లా
మూడు నెలలైనారాలే
నేను మూడు ఎకరాల్లో వరి పం డించిన. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడంతో ఆశతో 107 క్వింటాళ్ల వడ్లమ్మిన. రూ. 52,600 బోనస్ రావా లి. మూడు నెలలైనా ఇస్తలేరు. బోనస్ వస్తదని అప్పులు చేసిన. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయడం తగదు.
– బోయి రాములు, రైతు, లింగాపూర్, కోటగిరి మండలం, నిజామాబాద్ జిల్లా
బోనస్ రాలేదు
కోటపల్లిలో ఏ ర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో 120 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. 45 రోజులైంది. ఇప్పటివరకు రూపాయి బోనస్ రాలేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మా చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారు. ఇప్పుడు మేం ఎవరికి చెప్పుకోవాలి.
– రాళ్లబండి శ్యామ్‌సుందర్, కోటపల్లి, మంచిర్యాల జిల్లా
బోనస్ ఇయ్యలే.. రుణమాఫీ కాలే
సన్న వడ్ల బోనస్ కోసం ఎవుసం వదిలిపెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని జగిత్యాల జిల్లా ధ ర్మపురి మండలం దమ్మన్నపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన రైతులు తమకు బోనస్ ఇప్పించాలని, రూ.2 లక్షల రుణమాఫీ జరిగేలా చూడాలని కలెక్టర్ బీ సత్యప్రసాద్‌కు విన్నవించారు. బోనస్ రావ డం లేదని, తమ గ్రామంలో రుణమా ఫీ ఎవరికీ కాలేదని మండిపడ్డారు.