Congress | వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎండగడుతున్నారు. యాసంగి వడ్ల కొనుగోలు ఆలస్యమవుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతున్న రైతులు ప్ర భుత్వాన్ని బూతులు తిడుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవేదన వ్యక్తంచేశారు. వడ్ల కొనుగోలులో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోళ్లు వేగంగా జరిగేందుకు, మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఆరు జిల్లాల్లోని వడ్ల కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానకాలం సాగు, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది.
వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంటా అయిన రెండుమూడు రోజులకు కూడా లోడు దించుకోవడం లేదని, క్వింటాకు నాలుగైదు కిలోల కోత పెడుతున్నారని పేర్కొన్నారు. ఏ ఊరికి వెళ్లినా వడ్ల కొనుగోలు గురించే మాట్లాడుతున్నారని, రైతులు సర్కారును బూతులు తిడుతున్నారని వాపోయారు. ఇటీవల ఇక్కడికొచ్చి సమీక్షించిన పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలిచ్చినా ఎలాంటి మార్పు లేదన్నారు. కాంటాలై రోజులు గడుస్తున్నా మిల్లులు అన్లోడ్ చేసుకోవడం లేదని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గండ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరు కూడా బాగాలేదని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా ప్రొసీడింగ్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో జోక్యం చేసుకున్న పొంగులేటి పలుమార్లు గండ్రను వారించారు.
వడ్ల కొనుగోలు విషయంలో మిల్లర్లు సహకరించడం లేదని, రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. కొనుగోలు కోసం పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కాంటా పూర్తయిన వడ్లకు తేమ, తాలు పేరు చెప్పి నాలుగు రోజులైనా దించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.
వడ్ల కొనుగోలు ప్రక్రియలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. తమ కేంద్రంలో కొనుగోలు లక్ష్యం పూర్తయిందని, కొత్తగా కాం టా లు పెట్టబోమని రైతులను మిల్లర్లు భయపెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అధికారులు అలసత్వంతో వ్యవహరిస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రూనాయక్ అన్నారు. లబ్ధిదారుల జాబితాపై త్వరగా విచారణ పూర్తి చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వానలు పడితే పనులు ముందుకు సాగవని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వయోపరిమితి లేదని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలప ల్లి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. లబ్ధిదారులకు ఇప్పటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్, తాను ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జూన్ 6లోపు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరు కాలేదు. మూడునాలుగు నెలలకోసారి నిర్వహించే సమీక్షలోనూ సీతక్క పాల్గొకపోవడంపై అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. వరంగల్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో, సమీక్ష సమావేశాల్లో సీతక్క పాల్గొనడంలేదు. మరో మంత్రి కొండా సురేఖతో విభేదాల కారణంగానే సీతక్క దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కూడా సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టారు.