Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ) : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన దళిత పేద రైతు పంబ రాములమ్మ భర్త లక్ష్మయ్య పేరిట మొత్తం 2.38 ఎకరాల భూమి ఉన్నది. పాస్‌బుక్ నెంబర్ టి03030080496 ప్రకారం సర్వే నెం.392అలో 9 గుంటలు, 393అలో 7 గుంటలు, 421ఊలో 7 గుంటలు, 451ఆలో 2.15 గుంటల భూమి ఉంది. ఈ లెక్కన రైతుభరోసా కింద ఎకరానికి రూ.6 వేలు (గుంటకు రూ.150) ప్రకారం 118 గుంటలకు రూ.150 చొప్పున ఆమెకు రూ.17,700 అందాలి. కానీ కాంగ్రెస్ సర్కారు రూ.3,450 కోత పెట్టి, కేవలం రూ.14,250 మాత్రమే జమ చేసింది. మొ త్తం భూమిలో సర్వే నెం.451లోని 2.15 ఎకరాల భూమికి మాత్రమే రైతుభరోసా జమ చేసిన ప్రభుత్వం మిగిలిన సర్వే నెంబర్లలోని 23 గుంటలకు కోత పెట్టింది. ఇదేమిటని సదరు రైతు ఏఈవోను అడిగితే ‘మాకు తెలియదు’ అనే సమాధానమే ఎదురైంది. ఇది ఒక్క రాములమ్మ పరిస్థితే కాదు.. లక్షలాది మంది రైతుల దుస్థితి!
రైతుల పేరిట ఉన్న మొత్తం భూమికి రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం జమ చేయడం లేదు. కొంత భూమికి కోత పెడుతుండగా కారణాలు తెలియడం లేదు. ఈ సమస్యలపై ఏఈవోలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ అధికారులను అడిగినా తమకు తెలియదనే చెప్తున్నారు. దీనిపై ఓ ఏఈవో స్పందిస్తూ ‘ఈ సీజన్లో రైతుభరోసా ఏ లెక్క ప్రకారం వేస్తున్నారో తెలుస్తలేదు. అంతా గందరగోళంగా ఉన్నది.’ అంటూ వాపోయారు.
రైతుభరోసాలో కోతలు పెట్టేందుకు సర్కారు కుంటి సాకులు వెతుకుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఏ విధంగా ఎగ్గొట్టాలి? ఎలా కోత పెట్టాలనే ఆలోచన చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఈ సీజన్లో సుమారు 3 లక్షల ఎకరాలకు రైతుభరోసా సాయం పడకుండా ఆ భూములను బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులే స్వయంగా ధ్రువీకరించారు. సర్వేనంబర్లలో వాస్తవంగా ఉండాల్సిన భూమి కన్నా ఎక్కు వ ఉన్నదనే సాకు ముందట వేసుకున్నట్టు తెలుస్తున్నది. ఉదాహరణకు 750 సర్వే నంబర్లో 10 ఎకరాలుండాలి. కానీ కాలక్రమంలో క్రయవిక్రయాలతో ఆ సర్వే నంబర్లో 12-15 ఎకరాల భూమి ఉన్నట్టుగా గుర్తించినట్టు చెప్తున్నారు. అలాంటి సర్వే నంబర్లను గుర్తించి వాటిని బ్లాక్ చేసినట్టుగా అధికారులు తెలిపారు. ఎక్కువ ఉన్న భూమి ని బ్లాక్ చేయకుండా మొత్తం సర్వేనంబర్‌ను బ్లాక్ చేసి, ఆ సర్వేనంబర్‌లోని భూమికి రైతుభరోసా పడకుండా చేసినట్టు తెలిసింది.
రైతుభరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సీజన్లు ముగిశాయి. ఇందులో కేవలం నిరుడు యాసంగిలో మాత్రమే పాత పదివేలు (రైతుబంధు) జమ చేసింది. రైతుభరోసాలో మార్పులు, చేర్పులు, కోతల పేరిట వానకాలం సీజన్లో ఎగ్గొట్టింది. ఈ యాసంగైనా మొత్తం డబ్బు పడుతుందేమోనని ఆశించిన రైతులకు నిరాశ తప్పలేదు. జనవరి 26న ఆర్భాటంగా ప్రారంభించిన రైతుభరోసా పంపిణీ నేటికీ పూర్తికాలేదు. ఇంకా రైతులకు రూ.4,834 కోట్లు కాంగ్రెస్ సర్కారు బాకీ ఉన్నది. ఈ బకాయిలను మా ర్చి 31లోపు చెల్లిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారో? లేదో చూడాలి.
కేసీఆర్ ఉన్నప్పుడు మా మొత్తం భూమికి రైతుబంధు పైసలు పడేటివి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కోత పెడుతున్నది. మా ఏఈవో సార్‌ను అడిగితే ఆయనకు తెల్వదని చెప్తున్నడు. సాగు భూమికి కూడా సాయం ఇయ్యకపోతే ఎట్లా?