హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా రైతులకు అవసరమైన యూరియా పంపిణీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్.. తన వైఫల్యానికి కుంటి సాకులు వెతుకుతున్నది. ఓ వైపు కోతల మీద కోతలు పెడుతూ రైతులకు యూరియా దక్కకుండా చేస్తున్న ప్రభుత్వం.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూరియా యాప్ తీసుకొచ్చిందన్న విమర్శలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు మరో కొత్త కుయుక్తికి తెరలేపింది. మొన్నటివరకు పంటను బట్టి యూరియా పంపిణీ చేసిన సర్కార్ ఇప్పుడు భారీగా కోత పెట్టింది. పంటతో సంబంధం లేకుండా అన్ని పంటలకు ఒకే రకంగా యూరియా పంపిణీ చేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగానే పంట ఏదైనా సరే ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే యూరియా ఇవ్వాలని నిర్ణయించింది. యూరియా యాప్‌ను ప్రారంభించిన సమయంలో వరికి ఎకరానికి మూడు బ్యాగులు, మక్కజొన్నకు నాలుగు బ్యాగులు, మిరపకు ఐదు బ్యాగులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు యూరియా కొరత అధికం కావడంతో ఇందులో మార్పులు చేసింది.
మరోవైపు యూరియాను రైతులు ఇతర అవసరాలకు తరలిస్తున్నారనే నెపం కూడా మోపుతున్నది. ఈ కారణంగానే కోత పెట్టినట్టు వ్యవసాయశాఖ చెప్తున్నట్టు తెలిసింది. అంటే వరికి గతంలో ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వగా ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తారు, మక్కజొన్నకు నాలుగు బస్తాలు ఇవ్వగా ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తారు. ఇప్పటికే యూరియాను ఒకేసారి కాకుండా దశలవారీరిగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే ఎకరం ఉన్న రైతులకు ఒకేసారి, 1-5 ఎకరాల రైతులకు రెండుసార్లు, 5-20 ఎకరాలు ఉంటే మూడుసార్లు, 20 ఎకరాలకు పైన ఉంటే నాలుగు దఫాల్లో యూరియా పంపిణీ చేసేవారు. ఇందుకు 10-15 రోజుల వ్యవధిలో మరోసారి పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఈ వ్యవధిని 20 రోజులకు పెంచినట్టు తెలిసింది. ఒక రైతు ఇప్పుడు యూరియా తీసుకుంటే మరోసారి తీసుకునేందుకు 20 రోజుల వరకు వేచి చూడాల్సిందే. అప్పుడు దొరికితే తీసుకున్నట్టు లేకపోతే అంతేసంగతి.
ఇక యాప్‌లో సవాలక్ష సమస్యలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి యూరియా పంపిణీ చేయడంలేదు. ఒక్కో జిల్లాలో ఒక్కోసారి అనుమతి ఇస్తున్నారు. అంటే ఒక జిల్లాలో యూరియా పంపిణీ చేస్తే మరో జిల్లాలో యాప్ పని చేయదు. అంతే ఆ జిల్లాకు అనుమతి ఇచ్చే వరకు రైతులు ఎదురుచూడాల్సిందే. యాప్ తెరిచే వరకు పంటల సాగు వాయిదా వేసుకోవాల్సిందే. ఇలా యాప్‌తో రైతులు నరకయాతన పడుతున్నారు.