నిజామాబాద్ : రైతులు,పేదలు సీఎం కేసీఆర్కు రెండు కండ్లలాంటి వారని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం మంత్రి పర్యటించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను అదేశించి పలు సూచనలుచేశారు.
అనంతరం మంత్రి నివాసంలో వివిధ మండలాలకు చెందిన కుల సంఘ భవనాలకు ఆయా కుల సంఘ సభ్యులకు మంత్రి కోటి 80 లక్షల వ్యయంతో నిర్మించే భవనాల కోసం ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్ణాలు సంతోషంగా జీవించాలన్నదే ఆయన అభిమతమన్నారు. వ్యక్తి కేంద్రంగా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగుతుందని చెప్పారు.
పరిణితి లేని రాజకీయ నాయకులు కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో తమతో పోటీ పడాలని ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. బీజేపీ నాయకుల తీరు మార్చు కోవాలని సూచించారు. అలాగే ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, వి.జి గౌడ్ సహకారానికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.