హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుపై కక్షసాధింపు చర్యతో కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దానిని ఆచరణలో చూపారు. రైతుల గోడు తమకు పట్టదన్నట్టు కేంద్రం వ్యవహరించినా, వడ్ల కొనుగోళ్లపై రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించినా లెక్క చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో గురువారమే ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం మంచుకొండలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు.
మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పలుచోట్ల రైతులు సంతోషం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ధాన్యాభిషేకం చేశారు. ధాన్యం కొనుగోళ్లతో పలు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొన్నది. మరోవైపు వడ్ల సేకరణలో కేంద్రం తీరుపై రైతులు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్దేశం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.
బీజేపీ నేతల మాటలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి
రాష్ట్రంలో వరి వేయాలని.. కేంద్రంతో కొనిపిస్తామని రెచ్చగొట్టిన బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇప్పుడు పక్కకు తప్పుకొన్నారు. కేంద్రం తన బాధ్యతను విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
సీఎం నిర్ణయం చారిత్రాత్మకం.. సాహసోపేతం
బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ధాన్యం కొనకుండా తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తున్నది. రైతాంగం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఎన్ని కోట్లు అయినా వెచ్చిస్తామని సీఎం కేసీఆర్ అత్యంత సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ప్రతిపక్షాలు మాత్రం తమదే విజయమంటూ జబ్బలు సర్సుకొంటూ ప్రజల్లో కమెడియన్లుగా మారారు.
– మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
రైతులకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది. కేంద్రం తీరుతోనే సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నారు. సీఎం నిర్ణయం రైతుల్లో ధైర్యాన్ని నింపింది.
– మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
బీజేపీకి ప్రజలే బుద్ధిచెప్తారు
నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసి ప్రతి
గింజను సేకరిస్తాం.
– దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వానిది వ్యాపార ధోరణి
తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం వ్యాపార ధోరణితో ఆలోచిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలోని చెవిటి ప్రభుత్వానికి ఇవేవి పట్టలేదు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొంటామని ప్రకటించారు.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అప్పుడు బతిమాలారు.. ఇప్పుడు బద్నాం చేస్తున్నరు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రాష్ర్టాలను బలిపశువులను చేసింది. తన బాధ్యతల నుంచి అత్యంత తెలివిగా తప్పించుకొన్నది. తప్పంతా రాష్ర్టాలదే అన్నట్టు వ్యవహరిస్తున్నది. పదేండ్ల క్రితం వరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా రాష్ర్టాల నుంచి ధాన్యం కొన్న కేంద్రం తర్వాత నెమ్మదిగా బాధ్యతను రాష్ర్టాలపైకి నెట్టింది. ఆ మోసం ఎలా జరిగింది..?
2012 వరకు దేశంలో ధాన్యం కొనుగోలులో లెవీ విధానం అమల్లో ఉండేది. అంటే కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలుచేసేది. ఇందులో రాష్ర్టాలకు ఎలాంటి సంబంధం ఉండేదికాదు. ఎఫ్‌సీఐ నేరుగా మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకొని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది. ఆ తర్వాత మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకొని రాష్ర్టాలకు పంపిణీ చేసేది.
రాష్ర్టాల్లో ధాన్యం ఉత్పత్తి పెరగడం, క్షేత్రస్థాయిలో ఎఫ్‌సీఐకి తగినంత సిబ్బంది లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరణ కష్టంగా మారింది. దీంతో రాష్ర్టాల సహకారం కోరింది. ధాన్యం కొనుగోలుకు అయ్యే మొత్తం నిధులతోపాటు ఇతర ఖర్చులు కూడా భరిస్తామని పేర్కొన్నది.
కేంద్రానికి ధాన్యం కొనుగోలు తలకు మించిన భారం కావడంతో దాని నుంచి తప్పించుకొనేందుకు 2014లో డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ (డీసీపీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ధాన్యం కొనుగోలు భారాన్ని రాష్ర్టాలపైకి నెట్టింది. డీసీపీ విధానాన్ని బలవంతంగా రాష్ర్టాలపై రుద్దింది. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం దీన్ని ఆమోదించగా తెలంగాణలోనూ అదే కొనసాగుతున్నది. అంతేగానీ డీసీపీపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ప్రత్యేకంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.
ధాన్యం కొనుగోలు చేయడం చేతకాక డీసీపీ విధానం అమలు చేసి రాష్ర్టాలపై నెట్టిన కేంద్రం.. ఇప్పుడేమో ధాన్యంకొనుగోలు బాధ్యత మొత్తం రాష్ర్టాలదేనని చెప్తున్నది.
డీసీపీ విధానంలో భాగంగా తమకు ఎంత బియ్యం కావాలో ముందుగానే చెప్తామని, ఆ మేరకు బియ్యం ఇవ్వాలని పేర్కొన్నది. అదే విధంగా ధాన్యం కొనుగోలుకు అయ్యే ఖర్చును కూడా ముందుగానే ఇస్తామని నమ్మబలికింది. కానీ క్రమంగా అన్ని హామీలను తుంగలో తొక్కింది. వారికి బియ్యం ఎంత కావాలనే అంశాన్ని ముందుగా చెప్పడం లేదు. సీఎం కేసీఆర్ పలుమార్లు డిమాండ్చేసినా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నది. ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే నిధులను కూడా ముందుగా ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అప్పులు తెచ్చి ధాన్యం సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంపై వడ్డీల భారం పడుతున్నది.
డీసీపీ విధానంలోని నిబంధనలను చూపుతూ.. తాను చెప్పినంతనే కొనుగోలు చేయాలని షరతు పెట్టింది. అదే విధంగా రైతులకు మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా ఒక్క రూపాయి
కూడా ఎక్కువ ఇవ్వొద్దని షరతు పెట్టింది.
2014 తర్వాత దేశంలో బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ పెరగడంతో ఆ బియ్యం ఉత్పత్తిని కేంద్రమే ప్రోత్సహించింది. ఇందుకోసం బాయిల్డ్ మిల్లుల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలను కల్పించింది. ఇప్పుడేమో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చేతులెత్తేస్తున్నది.
యాసంగిలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్‌ను రా రైస్‌గా మార్చాలంటే ఎఫ్‌సీఐ నిబంధన ప్రకారం 68 కేజీలకు బదులుగా 50 కేజీల బియ్యమే ఉత్పత్తి అవుతుంది.
అంటే మరో 18 కేజీలు తక్కువగా వస్తాయి. ఈ 18 కేజీల లోటును పూడ్చడంపై కేంద్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. ధాన్యం కొనుగోలు ప్రసక్తే లేదని, వరి సాగు చేసిన రైతులు వారి చావు
వారు చావాలని చెప్పకనే చెప్పింది.