దేవరుప్పుల, ఫిబ్రవరి 23: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో నీళ్లు లేక యాసంగి వరి చేన్లు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయకపోగా, బావులు ఎండిపోయాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన నాట్లు ఎండుతుండటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
చేసేదేమీ లేక ఒక్కో మడి వదిలి బర్లు మేపుతున్నారు. ఇంకొందరు రైతులు ఆశలు వదులుకుని గొర్రెల కాపరులకు వరి చేన్లు అమ్ముకుంటున్నారు. పదేళ్లుగా యాసంగి పంటలు ఎండిన దాఖలాలు లేకపోవడంతో అదే నమ్మకంతో నాట్లు పెట్టిన రైతులు నీరు లేక పంటలు ఎండుతుండటంతో తల్లడిల్లిపోతున్నారు.