సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 10 : సాగు కోసం నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మోతె, చివ్వెంల, నడిగూడెం, మునగాల మండలాల్లో ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేటలోని ఎస్సారెస్పీ ఎస్ఈ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ యాసంగి పంటలకు విడతల వారీగా నీళ్లు విడుదల చేస్తామని స్వయంగా నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించినా నేటి వరకు నీళ్లు రావడం లేదని మండిపడ్డారు. మోతె, చివ్వెంల, నడిగూడెం, మునగాల మండలాల్లోని రైతులు తమకున్న బోర్లు, బావులు, చెరువులను ఉపయోగించుకొని వరినాట్లు వేసుకున్నారని, ప్రస్తుతం భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నామవరం చెరువును రిజర్వాయర్ చేసి పాలేరు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈ ప్రాంత చెరువులను నింపాలని కోరారు. అయితే ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.