ఏదుల, అక్టోబర్ 26 : సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏదులకు చెందిన రైతు కొమ్ము ఆంజనేయులు (50) గ్రామ సమీపంలోని ఏదుల రిజర్వాయర్ వద్ద ఉన్న పొలంలో మినుములు, రాగులు సాగుచేశాడు. పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పనుల్లో భాగంగా కేఎన్ఆర్ కంపెనీ రివిట్మెంట్, రోడ్డు పనులను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (సబ్ కాంట్రాక్టర్)కు అప్పగించారు. పనులకు ఉపయోగిస్తున్న వాహనాలు ఆంజనేయులు సాగు చేసిన పంట పొలంలో నుంచి పోవడంతో పంటకు తీవ్రనష్టం జరిగింది.
దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. పనులను అడ్డుకుంటావా అని పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్‌రెడ్డి బెదిరించగా భయాందోళనకు గురైన ఆంజనేయులు ఈ నెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబసభ్యులు ఆదివారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉంచి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేయడంతో రాస్తారోకో విరమించారు.