చిల్పూరు/ఆత్మకూరు/నవాబ్‌పేట, అక్టోబర్ 5: పంట దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, హనుమకొండ జిల్లాల్లో విషాదం నింపాయి. కాగా రుణమాఫీ కాలేదన్న దిగులుతో పాలమూరు జిల్లాలో మరో రైతు గుండె ఆగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. జనగామ జిల్లా చిల్పూ రు మండలంలోని శ్రీపతిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు(38) తనకున్న 1.3 ఎకరాల్లో వరి వేయగా మరో ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో తన వ్యవసాయ భూమిలో రెండు బోర్లు, బావి తవ్వేందుకు అప్పులు తెచ్చాడు. పంటలు సరిగ్గా పండక, సుమారు రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. ఆ మొత్తాన్ని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శనివారం పొలంలోనే పురుగుల మందు తాగాడు. అక్కడికి వచ్చిన రాజు భార్య సరిత అపస్మారక స్థితిలో ఉన్న భర్తను చూసి స్థానికుల సహాయంతో ఎంజీఎం దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినటుట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిరిపురం ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు
కాగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కాట్రేవుల సాంబమూర్తి (28) ఎనిమిది ఎకరాలను ఆరేళ్లుగా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో సరైన దిగుబడి లేకపోవడంతో సుమారు రూ.ఆరు లక్షలు అప్పయింది. ఈ అప్పు తీర్చే మార్గం లేక మానసికంగా బాధపడుతూ ఈ నెల 3న పత్తి చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆమె స్థానికులతో కలిసి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి కింద పడి ఉన్నాడు. వెంటనే ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రుణమాఫీ కాలేదన్న దిగులుతో పాలమూరు జిల్లాలో ఓ రైతు గుండె ఆగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఊరంచుతండాకు చెందిన కేతావత్ సోమ్లానాయక్ (59) కొన్నేండ్ల కిందట నవాబ్‌పేట ఎస్బీఐలో రూ.83 వేల పంట రుణం తీసుకున్నాడు. రూ.లక్షలోపే ఉన్నా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రుణమాఫీలో సోమ్లానాయక్‌కు మాఫీ కాలేదు. దీంతో బ్యాంకు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేశాడు. బ్యాంకుకు వెళ్తే వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లాలని, అక్కడికి వెళ్తే బ్యాంకుకు వెళ్లాలంటూ ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్పా అతడి సమస్యను పరిష్కరించలేదు. రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో మధనపడిన ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయ అధికారుల వెబ్సైట్లో స్టేటస్ చూస్తే.. ఆధార్, రుణఖాతాలో పేర్లు సరిపోలకపోవడంతో రుణమాఫీ కాలేదని తేలింది. అధికారుల తప్పిదం వల్లే పేరులో తప్పులు దొర్లినట్టు స్పష్టమవుతున్నది. ఈ విషయమై ఏవో కృష్ణకిశోర్‌ను వివరణ కోరగా పేరు మ్యాచ్ కాకపోవడంతోనే మాఫీ కాలేదని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ రవిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.