హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ):రైతుబంధు(రైతుభరోసా) నిబంధనల్లో మార్పుల కోసం రైతుల నుంచి సూచనలు తీసుకుందామనుకున్న ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. రైతులు సూచనలకన్నా ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుబంధు, విద్యుత్, రుణమాఫీ, ధాన్యం బోనస్ ఇలా అన్నింటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐటీ కట్టినా రైతు భరోసా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నిబంధనల్లో అతిగా కోతలు వద్దని, 10 ఎకరాల వరకు పరిమితి సరిపోతుందని సూచించారు. రైతుబంధు నిబంధనల్లో మార్పులపై సూచనల నిమిత్తం మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినా, ప్రభుత్వం ఆశించిన సూచనలు, సమాధానాలు రాలేదు. ముఖ్యంగా రైతుబంధులో అతిగా కోతలను రైతులు వ్యతిరేకించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే మాట్లాడించేందుకు అధికారులు ప్రయత్నించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని నిలువరించి.. తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. రైతుల నుంచి ఊహించనివిధంగా ప్రశ్నలు ఎదురుకావడంతో మంత్రి కూడా కొంత అసహనానికి గురైనట్టుగా తెలిసింది.
రైతుల సూచనలు – సమస్యలు
అర్హులకే రైతుభరోసా : తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయమంత్రి
రైతుభరోసాని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇకపై ఏడాదికి ఎకరాకు రూ.15వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం రైతుభరోసాపై విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని, అందరి అభిప్రాయాలు తీసుకుని… శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనా అర్హులకు మాత్రమే అందేవిధంగా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో ప్రణాళికసంఘం ఉపచైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అఖిలభారత కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘ నాయకుడు అన్వేష్‌రెడ్డి పాల్గొన్నారు.