బిజినేపల్లి/నాగర్‌కర్నూల్ టౌన్, ఏప్రిల్ 25: ఓ వ్యవసాయాధికారి రైతుభరోసా నిధులను స్వాహా చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ రైతు కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన రైతు వీరయ్యకు గ్రామ శివారులోని 406/అ సర్వే నంబర్లో 6 ఎకరాల 11 గుంటల భూమి ఉ న్నది. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతు రు ఉన్నారు. రైతు వీరయ్య 2020లో మరణించాడు. తండ్రి మరణం తర్వాత కుమారుల మధ్య విభేదాలు ఏర్పడటంతో భూమిని పట్టా చేసుకోలేదు. ఇదే అదునుగా భావించిన స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి మాత్రం వీరయ్యకు చెందిన రైతుబంధు డబ్బులను తన తల్లి నీలమ్మ పేరుపై సింగోటం గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాకు మళ్లించాడు.
పెట్టుబ డి సాయం అందడం లేదని వీరయ్య పెద్ద కొడుకు తిరుపతయ్య పలుమార్లు వ్యవసాయాధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తర్వాత వీరయ్య చిన్న కుమారుడు ఎల్లయ్య అన్న తిరుపతయ్యతో గొడవపడిన సందర్భంలో తండ్రి పేరుపై వచ్చే రైతుబంధు నిధులు కాజేస్తున్నావంటూ అభియోగం మో పాడు. అప్రమత్తమైన తిరుపతయ్య ఆన్లైన్ లో పరిశీలించగా.. వారికి అందాల్సిన రైతుబంధు నిధులు నీలమ్మ అనే మహిళ ఖాతాలో జమ అవుతున్నట్టు గుర్తించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టా రు. ఏవో కమల్కుమార్ను వివరణ కోరగా.. రైతుబంధు నిధులు దుర్వినియోగమైన మాట వాస్తవమేనని, అధికారులు విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు పంపించినట్టు తెలిపారు.
ఏఈవోపై సస్పెన్షన్ వేటు
వ్యవసాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న పాలెం క్లస్టర్ బిజినేపల్లి మండలానికి చెందిన వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) విష్ణువర్ధన్ రైతు భరోసా నిధులను దుర్వినియోగం చేసినందున అతడిని కలెక్టర్ సంతోష్ సస్పెండ్ చేశారని డీఏవో యశ్వంత్‌రావు తెలిపారు. సమగ్ర విచారణలో రైతు భరోసా పథకం నిధుల్లో రూ.1,94,525 దారి మళ్లించినట్టు గుర్తించి, ఈ మొత్తాన్ని రికవరీ చేసినట్టు పేర్కొన్నారు.