హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార సతీమణి 10% కమీషన్ అడిగారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని అంబర్‌పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్‌కు సోమవారం లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన సొమ్మును కమీషన్‌తో ముడిపెట్టడం తీవ్రమైన విషయమని, దీనిపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడి న విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు.
ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్కు కూడా మెయిల్ ద్వారా పంపినట్టు తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు భట్టి విక్రమార సతీమణి 10% కమీషన్ కోరారంటూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఉద్యోగిని ఎస్కే ప్రసన్నకుమారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గవర్నర్‌కు సమర్పించిన ఫిర్యాదులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆరోపణలు చేసిన ప్రసన్నకుమారితోపాటు ఇ లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఇతర రిటైర్డ్ ఉద్యోగుల వాం గ్మూలాలను సమగ్రంగా నమోదు చేయాలని కోరారు. మెడికల్ అండ్ హెల్త్ శాఖలో ఉన్నట్టు చెప్తున్న సుమారు రూ.120 కోట్ల పెండింగ్ బిల్లుల ఫైళ్ల కదలికను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఫిర్యాదు చేసిన ఉద్యోగినిని ఎలాంటి వేధింపులు లేదా ప్రతీకార చర్యలకు గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వేగంగా విడుదల చేయాలని కోరారు.