Suryapet | తుంగతుర్తి, జనవరి 5 : పోలీసుల విచారణలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా రావులపల్లిలో చోటుచేసుకున్నది.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు లాజరస్ కొనుగోలు చేశాడు. నాటి నుంచి నేటి వరకు లాజరస్ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇటీవల విజయసేనారెడ్డి భార్య సౌజన్యారెడ్డి, ఆమె కూతుళ్లు, తుంగతుర్తి తహసీల్దార్‌తో కలిసి రైతుకు తెలియకుండా రెండెకరాల 20 గుంటల భూమిని తమ పేరుపై పట్టా చేయించుకున్నారు. దీంతో ఈ నెల 2న తుంగతుర్తి తహసీల్ కార్యాలయం వద్ద తనకు న్యాయం చేయాలంటూ లాజరస్తోపాటు మరికొంతమంది రైతులు ధర్నా చేశారు.
సోమవారం ఉదయం రావులపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో బాధిత రైతులతో తుంగతుర్తి సీఐ నరసింహారావు విచారణ జరుపుతుండగా లాజరస్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. లాజ రస్ మృతదేహంతో కుటుంబసభ్యులు, గ్రా మస్తులు సౌజన్యారెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. సౌజన్యారెడ్డి, బాధ్యులైన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.