మల్లాపూర్, సెప్టెంబర్ 19 : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, మరో రైతు కోతుల నుంచి తన పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు( Electric shock) తగిలి మృతి(Farmer died) చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తన్న (60) రోజులాగే తనకు గ్రామ శివారులో ఉన్న పొలం వద్దకు మందును చల్లాడానికి వెళ్లారు. పక్కనే రత్నాపూర్ గ్రామానికి చెందిన గొండ సాయన్న అనే రైతు తన మక్క చేనును కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి, వ్యవసాయ మోటరు నుంచి అక్రమంగా కరెంట్‌ను పెట్టాడు.
ఈ క్రమంలో పెద్ద ముత్తన్న పొలానికి మందు చల్లి ఇంటికి వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తూ ఇనుప కంచెకు తాకడంతో షాక్కొట్టి అక్కడిక్కడే మృతి చెందాడు. సమయం గడిచినా పెద్ద ముత్తన్న ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా అక్కడే మృతి చెందినట్లు కనిపించాడు. మెట్పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన సాయన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.