ఎల్లారెడ్డి రూరల్, (గాంధారి) మార్చి 25: ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గడ్డ తండాకు చెందిన రైతు పిట్ల శ్రీను(30) ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతుల నేపథ్యంలో సమీపంలోని పొతంగల్ కలాన్ సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నాడు. అదే సమయంలో మరొకరు కూడా ఎల్సీ అడగడంతో సిబ్బంది విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఒకరి పని పూర్తి కావడం, ఎల్సీ రిటర్న్ చేయడంతో సబ్స్టేషన్ సిబ్బంది కరెంటు సరఫరా చేయడంతో అప్పటికే స్తంభంపై మరమ్మతులు చేస్తున్న పిట్ల శ్రీను విద్యుత్తు షాక్కు గురయ్యాడు. స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండావాసులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ సబ్స్టేషన్ వద్ద ఉంచి ఆందోళనకు దిగారు.
బోరు ఇంకిపోయిందని.. రైతు ఆత్మహత్యాయత్నం
పెబ్బేరు, మార్చి 25 : బోరు ఇంకిపోయిందని మనస్తాపం చెందిన యువ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెకు చెందిన శ్రీకాంత్ (35) వ్యవసాయం చేస్తున్నాడు. ఆరెకరాల్లో బత్తాయి తోట సాగు చేశాడు. ఇటీవల శ్రీకాంత్ పక్క పొలానికి చెందిన రైతు బోరు డ్రిల్ చేశాడు. దీంతో తోటకు నీరందడం లేదని ఆందోళనకు గురయ్యాడు. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం గాక చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పొలం వద్ద పురుగు మందు తాగాడు. కలెక్టర్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. ఆయన్ను కర్నూల్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది.