కెరమెరి, సెప్టెంబర్ 30 : చేతికి వచ్చిన పంట అడవి పందుల పాలవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. తుమ్మగూడ గ్రామానికి చెందిన చౌహన్ అరవింద్ (34) ఈ ఏడాది 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంట చేతికొస్తున్న సమయంలో అడవి పందులు దాడి చేసి నాశనం చేశాయి. తీవ్ర నష్టంరావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.
ఈ క్రమంలో మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే 108లో ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అకడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.