చిన్నశంకరంపేట, మే 20: ధాన్యం అమ్ముడు పోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండ లం అగ్రహారంలో బుధవారం చోటుచేసుకున్నది. మండలంలోని గవ్వలపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన గాయంతి రాజయ్య (45) తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేశాడు. కోత కోసి 20 రోజుల క్రితం అంబాజిపేట కొనుగోలు కేంద్రానికి తరలించాడు.
కాంటా కోసం ఇరువై రోజులుగా కొనుగోలు కేంద్రం చుట్టూ తిరిగాడు. ఓవైపు ధాన్యం అమ్ముడు పోక.. మరోవైపు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజయ్య.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేటు దవఖానాకు తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.