పటాన్చెరు టౌన్, ఆగస్టు 10 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో సోమవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు కరెంటు సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని గంటలపాటు చీకట్లోనే ఉన్నారు. పిల్లి గాయపరచడంతో ఓ వ్యక్తి చికిత్స కోసం ఉదయం దవాఖానకు వచ్చాడు. కరెంటు లేకపోవడంతో పేషెంట్ వెంట వచ్చిన వ్యక్తి సెల్ఫోన్ లైటు వేయగా వైద్యులు చికిత్స అందించారు. జనరేటర్ ఉన్నా ఎలక్ట్ట్రీషియన్ అందుబాటు లో లేకపోవడంతో గంటల తరబడి రోగులు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది.
ఎలక్ట్ట్రీషియన్ వచ్చి జనరేటర్ ఆన్ చేసినా.. కరెంటు ట్రిప్ కావడంతో దవాఖాన మొత్తం చీకట్లోనే ఉండిపోయింది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి నెలకొన్నది. విద్యుత్తు సమస్య తరచూ ఏర్పడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్ కూడా తరచూ మొరయిస్తున్నదని చెప్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.