జమ్మికుంట, నవంబర్ 9: చేతికొచ్చిన పంట మొంథా తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో కలత చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగంపేటకు చెందిన హరీశ్(28) బీటెక్ మధ్యలో ఆపేశాడు. తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాల్లో వరి, ఎకరంలో పత్తి సాగు చేశాడు. మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చేతికందిన పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడి రాదేమోనని బెంగతో మనస్తాపం చెందాడు.
పంటలకు పెట్టిన పెట్టుబడితోపాటు గతంలో ఉన్న మొత్తం అప్పు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు. స్థానికులు వెంటనే జమ్మికుంటలోని ఓ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. హరీశ్ తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు.