జైనథ్, సెప్టెంబర్ 3 : భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు కర్ల నారాయణ(58)కు 3.20 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు.
ఇందుకోసం దాదాపు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఈ ఏడాది తరచూ భారీ వర్షాలు కురియడంతో చేలలో నీరు నిలిచి పంట మురిగిపోయింది. దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం తెల్లవారుజామున తన కొట్టంలోని దూలానికి ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై స్వామి తెలిపారు.