బేల, ఏప్రిల్ 21 : పంటలు పండక.. దిగుబడి రాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటన్‌లో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. పాటన్ గ్రామానికి చెందిన రైతు తిప్పిరెడ్డి లస్మారెడ్డి(46)కి మూడెకరాల పొలం ఉండగా పత్తి, కంది వేశాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.80 లక్షల అప్పుతోపాటు మరో రూ.5 లక్షలు ప్రైవేట్‌గా తీసుకున్నాడు. మే 6న చిన్న కూతురు పెండ్లి కోసం లోన్ కావాలని సొసైటీ బ్యాం కుకు వెళ్లగా.. నోడ్యూస్ తీసుకురావాలని సూచించారు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకొని గ్రామీణ బ్యాంకులో అప్పు చెల్లించి నో డ్యూస్ తీసుకొని వచ్చాడు. గతంలో ఈయన తండ్రి గంగారెడ్డి పేరిట సొసైటీలో అప్పు ఉండటంతో అది తీర్చేవరకు కొత్త అప్పు ఇవ్వడం కుదరని అధికారులు చెప్పారు. దీంతో లస్మారెడ్డి మనస్తాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మధుకృష్ణ తెలిపారు.