దుబ్బాక, డిసెంబర్ 22: వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో విషాదం నింపింది. రామక్కపేటకు చెందిన చింతల ఎల్లం (42) వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసేవాడు. తనకున్న రెండు ఎకరాల పొలంలో మూడు బోరు బా వులు తవ్వించాడు. ఇందుకు రూ.6 లక్షలు వరకు అప్పు చేశాడు. పంటలు సరిగా పండక అప్పు తీర్చలేక తీవ్రంగా కలతచెందాడు.
ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి బయటకు వెళ్లిన ఎల్లం తిరిగిరాలేదు. ఆచూకీ కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మృతుడు చింతల ఎల్లంగా గుర్తించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు ఎస్సై కీర్తిరాజు తెలిపారు.