లోకేశ్వరం, అక్టోబర్ 28 : దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం మొహల గ్రామానికి చెందిన రైతు దండే గంగన్న(53) తనకున్న మూడెకరాల్లో పత్తి, వరి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడేండ్ల క్రితం కూతురు మౌనిక పెండ్లి చేశాడు. ఇందుకోసం రూ.5 లక్షల అప్పు చేశాడు.
కేసీఆర్ సర్కార్ రైతులను ఆదుకోవడంతో అప్పు సులువుగా తీర్చవచ్చని భావించాడు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు కోతలు, సరిపడా ఎరువులు ఇవ్వకపోవడం, రైతుబంధు, పంట దిగుబడి రాకపోవడంతో నష్టపోయాడు. దీంతో మనోవేదనకు గురయ్యాడు. ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగన్న భార్య భోజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు.