Farmer Suicide | మొగుళ్లపల్లి, ఫిబ్రవరి 15: దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన పండుగ కొమురయ్య (65) తనకున్న పది ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు నాలుగు ఎకరాల చొప్పున ఇచ్చాడు. మిగిలిన రెండు ఎకరాలతోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి వేశాడు.
గత సంవత్సరం పంటల దిగుబడి సరిగా రాకపోవడం, ఈసారి కూడా ఆశించిన స్థాయిలో పంటలు పండలేదు. పంటల సాగు కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు పెరగడంతో కొద్దిరోజులుగా దిగాలు ఉంటున్న కొమురయ్య శనివారం మిర్చి తోటలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. చుట్టుపకల వారు గమనించి వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు.