గుడిహత్నూర్, అక్టోబర్ 23 : రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాకు చెందిన ఆడె గజానంద్ (30) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య(Farmer Commits suicide) చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజానంద్ మూడేండ్ల నుంచి నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. యేటా అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో పంట కోసం రూ. 6 లక్షలు అప్పు చేశాడు.
గుడిహత్నూర్ మహారాష్ట్ర బ్యాంకులో రూ.3 లక్షలు, ఇచ్చోడ ఎస్బీఐలో రూ.1.50 లక్షలు, ప్రైవేట్‌గా మరో ఇద్దరి వద్ద రూ.2 లక్షల చొప్పున అప్పు చేశాడు. ఈ యేడాది కూడా దిగుబడి సరిగా లేక.. అప్పు ఎలా తీర్చాలనే బెంగతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం చేను వద్ద పురుగుల మందు తాగాడు. పక్కన ఉన్న చేను వాళ్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. గజానంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు.