కాటారం, జూలై 24 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోలొండ రైతు పోచం (64) తనకున్న రెండెకరాల భూమితోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు.
నిరుడు పత్తి, మిర్చి పంటల్లో సరైన దిగుబడులు రాకపోవడంతో పెట్టుబడుల కోసం తెచ్చిన రూ.3 లక్షలు అప్పు అలాగే ఉండిపోయింది. అ ప్పులు ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు. బుధవారం సాయంత్రం ఇంటి వెనక ఎడ్లకొట్టంలో పురుగుల మందుతాగి పడిపోయాడు. భార్య లక్ష్మి గమనించి కుటుంబ సభ్యుల సహాయంతో పోచంను 108 వాహనంలో భూపాలపల్లి వంద పడకల వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్టు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.