బేల, ఫిబ్రవరి 14 : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పఠాన్ గ్రామానికి చెందిన రైతు గడ్డం రాంరెడ్డి(55) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాంరెడ్డికి జైనథ్ మండలంలో మూడు ఎకరాల భూమి ఉండగా.. అది వేరే వాళ్లకు కౌలుకు ఇచ్చాడు. బేల మండలం పఠాన్ గ్రామంలో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సోయా, పత్తి, కంది వేశాడు.
ఇందుకోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2 లక్షల అప్పుతోపాటు ప్రైవేట్‌గా రూ.10 లక్షల అప్పు చేశాడు. పంట సరిగా రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక, రెండు రోజుల నుంచి బెంగతో ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం పశువుల కొట్టంలో మద్యం బాటిల్లో పురుగులమందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.