చేర్యాల, ఆగస్టు 3: వానలు రాక.. పె ట్టుబడి లేక.. ఉన్న అప్పులు తీరక మనస్తాపంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. చేర్యాల మండలం చిట్యాలకు చెందిన రైతు మ్యాక సత్తయ్య(35) తన రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పెట్టుబడికి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నాడు. అప్పటికే ఉన్న రూ.5 లక్షల అప్పు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురయ్యాడు. శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.