దుబ్బాక, కమలాపూర్ మార్చి 12: తెలంగాణ వ్యాప్తంగా పదేండ్లు సుభిక్షంగా సాగిన సాగు నేడు సంక్షోభంలో చిక్కుకున్నది. ఊరూరా రైతన్నల గోడు వర్ణణాతీతంగా మారింది. యాసంగి పంటకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. కండ్ల ముందే పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఆరుగాలం శ్రమించిన పం ట పొలాలు నీళ్లు లేక నెర్రెలువారుతుంటే కన్నీళ్లు ఇంకిపోయేలా రోదిస్తున్నారు. చేతికి అందివచ్చిన పంటపై ఆశలు లేక దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్‌లో అప్పులబాధతో కౌలురైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం మంతూర్‌కు చెందిన కౌలు రైతు ఈరమైన మల్లయ్య (50) తనకున్న అర ఎకరం పొలాన్ని నిరుడు అమ్మేశాడు. గ్రామానికి చెందిన మరొకరి పొలాన్ని మల్లయ్య కౌలుకు తీసుకుని యాసంగిలో వరి పంట సాగు చేస్తున్నాడు. పంట చేతికొచ్చే సమయం లో సాగునీరు లేక కండ్ల ముందే పం ట ఎండిపోవడం తో మానసికంగా కలత చెం దాడు. దీంతోపాటు 6నెలల క్రితం మల్ల య్య తన కూతురు వివాహం చేశాడు. వివాహం కోసం తెలిసిన వారి వద్ద అప్పు లు చేశాడు. ఓ పక్క పెరిగిన అప్పులు, మరోపక్క వరి పంట ఎండిపోవడంతో ఆందోళన చెందిన మల్లయ్య సోమవారం రాత్రి పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్యకు భార్య మల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన కౌలు రైతు ముప్పు కుమారస్వామి (50) బుధవారం కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమారస్వామి అదే గ్రామానికి చెందిన పల్లె కొమురయ్యకు చెందిన వ్యవసాయభూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఉదయం వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన కుమారస్వామి తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ వద్ద చనిపోయి ఉన్నాడు.