Farmer Suicide | ముస్తాబాద్, మార్చి 24: పొలంలో సాగునీరు లేక అప్పులు చేసి రెండు బోర్లు వేశాడు. ఉపాధి కరువై ఇద్దరు కొడుకుల్ని గల్ఫ్ పంపేందుకూ చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఈ ఊభి నుంచి బయటపడే ఆ రైతు ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి పేరిట ఉన్న తన సొంత భూమి అమ్మకానికి తోడబుట్టిన సోదరుడే సహకరించలేదు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా పరిష్కారానికి నోచలేదు. పోలీస్‌స్టేషన్ మెట్లెక్కినా ఫలితం దక్కలేదు. దీంతో చావే దిక్కనుకున్నాడు. అమ్మ వారే సాక్ష్యం అని నమ్ముకున్నాడో ఏమో? కానీ ఊరి సమీపంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయలో గంటకు ఉరేసుకొని ఆ రైతు తనువు చాలించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో చిన్న సాయిలు, ఎల్లవ్వ దంపతులకు నలుగురు కొడుకులు.
అందరూ భూమి పంపకాలు చేసుకున్నారు. వారి మూడో కొడుకైన పర్శరాములు (48)కు ఇంటి సమీపంలో 14 గుంటల భూమితోపాటు మరోచోట రెండెకరాలు వచ్చింది. అందులో సాగు చేసుకుంటున్న పర్శరాములు నీళ్ల కోసం అప్పులు చేసి రెండు బోర్లు వేశాడు. తన ఇద్దరు కొడుకులను గల్ఫ్ దేశం పంపించేందుకూ అప్పులు చేశాడు. ఆ బాకీలు తీర్చేందుకు ఇంటి సమీపంలో ఉన్న 14 గుంటల భూమిలో రెండు గుంటల స్థలాన్ని విక్రయించాలని అనుకోగా, అది తన తండ్రి పేరున పట్టా ఉండటంతో సోదరులను సంప్రదించాడు. ఇందులో ఇద్దరు సోదరులు సంతకాలు చేసేందుకు ముందుకు రాగా, పెద్ద సోదరుడు నిరాకరించాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. పోలీస్‌స్టేషన్‌కు సైతం వెళ్లాడు. అయినా ఫలితం లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా చెల్లించాలనే దిగులుతో మనోవేదనకు గురయ్యాడు. గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మ ఆలయంలో ఉన్న గంటకు ఉరేసుకుని పర్శరాములు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెళ్లి కన్నీమున్నీరుగా విలపించారు. రైతు భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి
నాగర్‌కర్నూల్, మార్చి 24: పొలంలో విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ (60) మూడెకరాల్లో మక్కలు సాగు చేశాడు. పంటకు నీళ్లు పెట్టేందుకు సోమవారం ఉదయం పొలానికి వెళ్లాడు. బోరు మోటర్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
అప్పులబాధతో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య
వెల్దుర్తి, మార్చి 24: అప్పులు అధికం కావడం, బర్డ్‌ఫ్లూ భయం ఆ రైతును వెన్నాడింది. ఇదే సమయంలో కోళ్లఫారం వృథాగా ఉండటంతో అప్పులను తీర్చేదారి లేక మనస్తాపానికి గురైన పౌల్ట్రీ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన పడిగె అనిల్‌కుమార్ (26) కోళ్ల ఫారం నిర్వహిస్తుంటాడు. బర్డ్‌ఫ్లూ భయంతో కోళ్లు లేక ఫారం ఖాళీగా ఉన్నది. ఇటీవలే అప్పులు చేసి బోర్లు వేయడంతోపాటు ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. దీంతో అప్పులను తీర్చేదెలా అని మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం అనిల్‌కుమార్ పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య దీపిక, మూడు నెలల కూతురు ఉన్నారు.