కేసముద్రం, డిసెంబర్ 9 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహిమూద్పట్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని ఆరోపిస్తూ ఏశబోయిన మురళి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గంటపాటు అక్కడే ఉండగా ఎస్సై నరేశ్, కొనుగోలు కేంద్రం నిర్వాహుకులు నచ్చచెప్పడంతో కిందికి దిగివచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండెకరాల్లో వరి సాగు చేశానని, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిపోయిందని వాపోయారు. బోనస్ వస్తుందనే ఆశతో ధాన్యాన్ని వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చానని తెలిపారు. వివిధ కారణాలు చూపుతూ ఆలస్యంగా బస్తాలు ఇచ్చారని, ధాన్యం కాంటా అయినప్పటికీ తోలకాలు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.