నాగర్కర్నూల్, ఆగస్టు 10 : రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోయిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, బాధితుడి కథనం మేరకు.. కత్తె రాములు, కత్తె మల్లేశ్, కత్తె జ్యోతికి వనపట్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 135లో 4 ఎకరాల 38 గుంటలు ఉన్నది. ఈ భూమిని 2022లో వనపట్లకు చెందిన ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచి ఎకరం రూ.1.36 కోట్లుగా ధర ఖరారు చేసి విక్రయించారు. రూ.2.32 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి, మిగతా డబ్బులను ఏడాదిలోగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని అగ్రిమెంట్ చేసుకున్నారు.
అయితే, డీటీసీపీ అప్రూవల్ నిమిత్తం పది శాతం భూమిని గ్రామ పంచాయతీకి అప్పజెప్పాలని కత్తె రాములు, కత్తె మల్లేశ్, కత్తె జ్యోతిని నమ్మించి.. మొత్తం భూమిని వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గడువు తీరిన తరువాత మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో వారి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కత్తె మల్లేశ్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన తోటి రైతులు అతడిని జిల్లా దవాఖానకు తరలించారు. నిరక్షరాస్యులైన తమను మోసం చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని, మిగతా డబ్బులు ఇప్పించాలని మల్లేశ్ కోరారు. ఈ విషయం శనివారం సోషల్ మీడియాలో వైరలైంది. ఇదిలావుండగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కరెంట్ షాక్తో రైతు మృతి
ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 10: పొలంలో స్టార్టర్ బాక్స్ మరమ్మతు కోసం ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేందుకు యత్నిస్తూ ఓ రైతు విద్యుత్తు షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేట్కు చెందిన రైతు మామాడి పెద్ద చిరంజీవులు (54) శనివారం తన భార్యతో కలిసి పొలంలో మందు చల్లేందుకు వెళ్లాడు.
దాహం వేయడంతో బోర్ వేసేందుకు వెళ్లగా ఆన్ కాలేదు. స్టార్టర్ బాక్స్ పాడైందని గుర్తించిన చిరంజీవులు దాన్ని సరిచేయడానికి పొలం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. హ్యాండిల్ పట్టుకుని ఆఫ్ చేసేందుకు యత్నిస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సంగీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.