ఖమ్మం రూరల్, ఆగస్టు 4: భూ వివాదం నేపథ్యంలో పురుగుమందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జాన్‌బాద్‌తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డికి మూడు ఎకరాల భూమిని ఉన్నది. అతడి సోదరుడు భూపాల్‌రెడ్డి.. అదే గ్రామానికి చెందిన జాటోత్ వీరన్న దగ్గర కొంత అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆయన భూమిని వీరన్న స్వాధీనం చేసుకున్నాడు.
భూపాల్‌రెడ్డి భూమి పక్కనే వెంకటరెడ్డి భూమిని వీరన్న ఆక్రమించాడు. ఆదివారం వీరన్న ట్రాక్టర్‌తో వెంకటరెడ్డి పొలాన్ని దున్నుతుండగా.. వెంకటరెడ్డి దున్న వద్దంటూ వేడుకున్నాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. ఎనిమిదేండ్లుగా ఇబ్బంది పడుతున్నానంటూ పొలం వద్ద సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. ఆ తరువాత పురుగుల మందు తాగాడు. వెంకట్‌రెడ్డి ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ఖమ్మం రూరల్ ఎస్సై రామారావు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.