బెల్లంపల్లి, జూలై 13 : ఇరవై ఎకరాల్లో వేసిన పత్తి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారంటూ దుగినేపల్లికి చెందిన రైతులు ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇందులో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. బెల్లంపల్లి మండలం దుగినేపల్లికి చెందిన రైతులు కాశిపాక రాజం, కాశిపాక గంగారంతోపాటు మరో 10 మందికి నెన్నెల మండలం బొప్పారం శివారులోని 20ఏండ్లుగా పత్తి సాగు చేసుకుంటున్నారు. ఈనెల 11న అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ భూమిల్లో సాగు చేస్తున్నారంటూ 20ఎకరాల్లో వేసిన పత్తి పంటను ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
మెయిన్ గేట్ ఎదుట పురుగుల మందు డబ్బా, పెట్రోల్ సీసాలు, ధ్వంసమైన పత్తి మొక్కలతో నిరసనకు దిగారు. అనంతరం వినోద్‌ను కలవడానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, ఎమ్మెల్యే పీఏ రామకృష్ణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసిపాక గంగారం అనే రైతు పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో ఆగని గంగారం పెట్రోలును ఒంటిపై పోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.