రాయపర్తి, జూలై 25 : అధికారులు విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ శివారు బీల్నాయక్తండాకు వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు అందించే ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల క్రితం కాలిపోయింది. ఈ విషయాన్ని బీల్నాయక్తండాకు చెందిన రైతు బానోత్ రమేశ్‌నాయక్ మైలారం సబ్‌స్టేషన్‌లో అధికారులకు విన్నవించాడు.
ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ ఉన్నదని, కొత్తగా కొందరు రైతులతో డీడీలు కట్టిస్తే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని అధికారులు చెప్పారు. మరికొందరు రైతులు డీడీలు తీసి అధికారులకు అందించారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నార్లు, పంటలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తోచక గురువారం సాయంత్రం రైతు రమేశ్‌నాయక్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
రైతు రమేశ్ నాయక్ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో విద్యుత్తు శాఖ అధికారులు వెంటనే దిగొచ్చారు. గంటల వ్యవధిలోనే బీల్నాయక్తండాలో కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. వర్ధన్నపేట ఏడీఈ నటరాజ్‌ను మాట్లాడుతూ సాంకేతిక సమస్యల కారణంగా ట్రాన్స్ఫార్మర్ అందించడంలో ఆలస్యమైందని, గురువారం సాయంత్రమే కొత్త ట్రాన్స్ఫార్మర్ను బిగించి సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు.