ఏటూరునాగారం, ఏప్రిల్ 23 : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. ఏటూరునాగారానికి చెందిన రైతు మాటూరి సాంబయ్య రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. నిరుడు కూడా మిర్చి వేయగా నష్టం వచ్చింది.
ఈ సారి కూడా నష్టం రావడంతో సుమారు రూ.2 లక్షలకుపైగా అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి పురుగు మందు డబ్బా తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో వెంటనే 100కు డయల్ చేసింది. పోలీసులు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయగా మిర్చి కల్లం వద్ద సాంబయ్య ఉన్నట్టు గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో సాంబయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. వెంటనే స్పందించి తన భర్తను కాపాడినందుకు సాంబయ్య భార్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.