గుర్రంపోడ్, మే 10: భూ వివాదం నేపథ్యంలో పోలీసులు తననే స్టేషన్‌కు పిలిపిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ రైతు శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథనం ప్రకారం.. గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన ఐతరాజు రమేశ్‌కు గ్రామంలోని సర్వే నంబర్ 524లో 2.20 ఎకరాల భూమి ఉన్నది. పట్టా కూడా ఆయన పేరిటే ఉన్నది. సదరు భూమిని వేరేవారు అనుభవిస్తున్నారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయితే భూమిపై హకు తమకే ఉన్నా, పోలీసులు తమనే తరుచూ స్టేషన్‌కు పిలిపిస్తున్నారని, తమకు న్యాయం జరుగడం లేదని మనస్తాపానికి గురైన రమేశ్ శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగాడు. అడ్డుకున్న పోలీసులు హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం నల్లగొండ దవాఖానకు తరలించారు.
తాము 35 ఏండ్లుగా అనుభవిస్తున్న భూమిలో రమేశ్ దౌర్జన్యంగా గడ్డి వాము వేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడని గోలి రేణుక ఫిర్యాదు చేసినందున.. అతడిని స్టేషన్‌కు పిలిపించినట్టు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు. దౌర్జన్యంగా వేసిన గడ్డి వాములు తొలగించాలని, భూమికి సంబంధించి హకు పత్రాలు తెచ్చుకుని సర్వేయర్లతో రాళ్లు పాతించుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. కానీ అతను బ్లాక్మెయిల్ చేసేందుకే పురుగుల మందు తాగే ప్రయత్నం చేసినట్టు తెలిపారు.