Home Guards | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన బాటపట్టిన హోంగార్డులను, వారి కుటుంబ సభ్యులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా ఛేదించుకొని హైదరాబాద్ ఇందిరాపార్క్‌కు చేరుకున్న హోంగార్డుల భార్యలను అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన హోంగార్డులు, హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టేందుకు పిలుపునిచ్చారు. ఈ దశలో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో హోంగార్డులు, వారి కుటుంబాలు తరలిపోకుండా పోలీసులు మోహరించారు. పోలీస్స్టేషన్లు దాటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వేలాది మంది హోంగార్డులు పరేడ్ మైదానాలకే పరిమితమయ్యారు.
నవంబర్ 2న తమ డిమాండ్ల సాధనకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, వారి భార్యలే ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శనివారం మధ్యా హ్నం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. హోంగార్డుల హెచ్చరికలతో అప్పటికే ఇందిరాపార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ధర్నా చేసేందుకు వచ్చిన హోంగార్డుల భార్యలను అడ్డుకున్నా రు. దీంతో వారంతా ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినదించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక దోమలగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆందోళనను పోలీసులు జిల్లాల్లోనే అడ్డుకోవడంతో హోంగార్డులు ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలకు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. తక్షణం తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు తీర్చాలని వేడుకున్నారు. తమ సంక్షేమం గురించి, జీత భత్యాలు, వేతన సవరణ గురించి పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు సిద్ధమైనట్టు హోంగార్డులు చెప్పారు. నాడు ప్రతిపక్షంలో హోంగార్డులను ఊరించిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కనీసం వినతిపత్రాలు కూడా తీసుకునే సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ యూనిఫాం అలవెన్స్‌ను ఇవ్వాలని, ఆర్డర్లీ వ్యవస్థను తొలగించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, సాధారణ మరణానికి రూ.5 లక్షల నగదు ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2017లో తీసుకొచ్చిన ఎస్‌పీఏను అమలు చేయాలని, ఆర్డర్ టు సర్వ్ ద్వారా హోంగార్డులను తమ సొంత జిల్లాలకు పంపాలని కోరారు. ఇతర ఉద్యోగులతోపాటు హెల్త్‌కార్డులు ఇవ్వాలని హోంగార్డులు డిమాండ్ చేశారు. హోంగార్డులపై వేధింపులను ఆపాలని కోరారు.
‘మొన్న టీజీఎస్పీ పోలీసుల భార్యలు రోడ్డెక్కితే.. నేడు హోంగార్డుల భార్యలు రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసుల ఆందోళనలతో శాంతిభద్రతలు అడుగంటాయి.. అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పాలన పట్టాలు తప్పిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?’ అంటూ తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. దీంతో పాటుగా #CongressFailed Telangana అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన హోంగార్డుల భార్యలను అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం పోలీసులు, హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు పోరుబాట పట్టిన హోంగార్డులను ఉన్నతాధికారులు కట్టడి చేశారు. శనివారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా ఆరు గంటలకుపైగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోనే ఖాళీగా కూర్చోబెట్టారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేసే హోంగార్డులు ఆందోళనకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఆర్మూర్, బోధన్ డివిజన్లలోనూ హోంగార్డులను రప్పించుకుని మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టారు. నల్లగొండ జిల్లాలోని హోంగార్డులకు శనివారం పరేడ్‌కు రావాలని హుకూం జారీ చేశారు. తిరుమలగిరి మండలం కన్నారెడ్డికుంటతండాకు చెందిన హోంగార్డు భూక్య సోమ్లానాయక్ హైదరాబాద్‌కు బయల్దేరగా తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు.
– వినాయక్‌నగర్/నీలగిరి