Telangana | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్రకటించి వారం గడుస్తున్నా.. ఆ రెండు జాతీయ పార్టీలు టికెట్ల ఊసే ఎత్తడం లేదు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఖమ్మంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా సభలు నిర్వహించినా.. ఎక్కడా పోటీచేసే అభ్యర్థుల ఊసు కానీ, చేరికల జాడ కానీ కనిపించలేదు. ఈ రెండు సభల్లోనూ ఆ పార్టీల అగ్రనేతలు అరిగిపోయిన రికార్డుల్లా ఉత్త మాటలకే పరిమితమయ్యారు. తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్పై అసత్యపు ఆరోపణలు చేసి తమస్థాయిని దిగజార్చుకొన్నారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే టికెట్ దక్కని అసమ్మతులు తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతారని కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఖర్గేను, బీజేపీ అమిత్ షాను రాష్ర్టానికి రప్పించాయి. కానీ, వారి ఆశలు ఆడియాసలే అయ్యాయి. టికెట్ ఆశించే ఏ ఒక్క అసమ్మతి నాయకుడు కూడా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ గడప తొక్కలేదు. బీఆర్ఎస్ను గద్దె దింపుతామన్న మాటే తప్ప తాము ఏ విధంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాగలమో ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయాయి.
టికెట్లు ప్రకటించలేని దుస్థితి
అధికార బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించింది. ఎన్నికలకు ఇంకా 100 రోజుల వ్యవధి ఉండగానే 115 మందితో బీఆర్ఎస్ తన తొలి జాబితాను విడుదల చేసింది. బీఆర్ఎస్లా కాంగ్రెస్కానీ, బీజేపీకానీ అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితి. వారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీలోనే జరగాలి. పార్టీ మ్యానిఫెస్టో కూడా ఢిల్లీ పెద్దలే ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర నాయకుల పాత్ర పరిమితమే. ఢిల్లీనుంచి ఆదేశాలు లేనిదే సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఆ రెండు పార్టీలు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపితే.. అభ్యర్థుల జాబితా ఫైనల్ అవుతుంది. ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కేవలం పోస్ట్మ్యాన్లా జాబితాను ఇక్కడికి చేరవేసి, అభ్యర్థులను ప్రకటిస్తారు.
నైరాశ్యంలో బీజేపీ, కాంగ్రెస్.. ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్
కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా మొదలుపెట్టకముందే బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులు అప్పుడే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తిరిగి అభ్యర్థులుగా ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు స్వాగతించాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేలకు ఘనంగా స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం అందించాలని పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుండగా, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే ఇంకా ప్రారంభం కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీశ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి.